- 80 డాలర్లు తగ్గిన ఔన్సు బంగారం
- స్థానిక మార్కెట్లో నేడు భారీగా తగ్గే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 6: డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో పపంచ మార్కెట్లో బుధవారం రాత్రి బంగారం ధర నిలువునా పతనమయ్యాంది. కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ ధర 80 డాలర్ల మేర తగ్గి 2,680 డాలర్ల వద్ద కదులుతున్నది.
ఈ ప్రభావంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో బుధవారం రాత్రి 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత కలిగిన బంగారం రూ.1,800 వరకూ క్షీణించి రూ.76,700 సమీపంలో ట్రేడవుతున్నది. డాలర్, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో వీటికి ప్రతికూలంగా స్పందించే బంగారం పతనమయ్యిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
అయితే సాయంత్రం సమయానికే ట్రేడింగ్ ముగిసే స్థానిక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 110 మేర పెరిగి రూ.80,350 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గుదలతో 73,650 వద్ద నిలిచింది.