* యూరప్ దేశాల్లో ప్రధాన సమస్యలు ఇవే
* యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: సహజీవనం, స్వలింగ వివాహాలు సామాజిక నిబంధనలకు విరుద్ధమని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. గడ్కరీ తాజాగా ఓ యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని సహజీవనం, స్వలింగ వివాహా పద్ధతులను తప్పుబట్టారు. ఈ విధానాలు సా మాజిక నిర్మాణాన్ని పతనంవైపు తీసుకెళ్తాయని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ దేశాల ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సహజీవనమేనన్నారు. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పారు.
తాను బ్రిటన్ పార్లమెంట్‌ను సందర్శించిన సందర్భంగా స్వయంగా యూకే ప్రధాన మంత్రి, విదేశాంగశాఖ మంత్రి యూరోపియన్ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్టు తెలిపారు. సహజీవనంలో ఉండి పిల్లలకు జన్మనిస్తే తర్వాత వాళ్ల భవిష్యత్తు ఏంటని గడ్కరీ ప్రశ్నించారు. ఎంత మంది పిల్లలను కనాలనేది తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పిల్లలను సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత తప్పకుండా తల్లిదండ్రులపై ఉంటుందని స్పష్టం చేశారు.
సమాజంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయనీ వాటిని సహజీవన విధానం నాశనం చేస్తుందని చెప్పారు. స్వలింగ వివాహా విధానం సామాజిక నిర్మాణాన్ని పతనంవైపు నడిపిస్తుందని తెలిపారు. భారతదేశంలో విడాకుల ను నిషేధించాల్సిన అవసరాన్ని ఆయన తిరస్కరించారు. దేశంలో సమతుల్య లింగ నిష్పత్తి కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మహిళల సంఖ్య విపరీతంగా పెరిగి పురుషుల సంఖ్య తక్కువ ఉంటే పురుషులు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాడానికి అనుమతించాల్సి ఉంటుందన్నారు.