10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్
15 వేల మంది యువతకు ఉద్యోగావకాశం
అమెరికాలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుతో కంపెనీ ప్రతినిధి బృందం చర్చ
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, హైదరాబాద్‌లో అగ్రశ్రేణి కంపెనీల స్థాపన, వేలాది మందికి ఉపాధి కల్పనే ప్రాధాన్యంగా మొదలైన సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటన లక్ష్యం నెరవేరుతోంది. ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకొచ్చింది.
హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావకాశం కల్పించేలా కొత్త సెంటర్‌ను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని ఏర్పాటుచేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది.
టైర్-2, టైర్-3 సిటీలకూ విస్తరించండి
ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు.
కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర టైర్ టైర్ నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలని సీఎం చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు.
హైదరాబాద్ వృద్ధికి దోహదం
ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు.
ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్
టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో మా కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తం గా ఉన్న మా క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతపై కొత్త కేంద్రం దృష్టిసారిస్తుంది.
ఎస్ రవికుమార్,
కాగ్నిజెంట్ సీఈవో