calender_icon.png 11 October, 2024 | 7:56 PM

ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ దావా

25-08-2024 12:30:00 AM

వ్యాపార రహస్యాల్ని చోరీ చేస్తున్నదంటూ ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై చోరీ ఆరోపణలు చేస్తూ మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ కాగ్నిజెంట్ యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. తమ హెల్త్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ట్రేడ్ సీక్రెట్స్, సమాచారాన్ని ఇన్ఫోసిస్ దొంగిలించిందంటూ కాగ్నిజెంట్ సబ్సిడరీ ట్రైజెట్టో టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా ఫైల్ చేసింది. ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్ ఫేసెట్స్, క్యూనెక్ట్స్ నుంచి చట్టవిరుద్ధంగా డేటాను యాక్సెస్ చేసుకున్నదానినే ఉపయోగించి పోటీ ఉత్పత్తిని ఇన్ఫోసిస్ డెవలప్ చేసిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. న్యూజెర్సీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్‌కు భారత్‌లోనే మెజారిటీ ఉద్యోగులు ఉన్నారు. 

ఇన్ఫోసిస్ ఖండన

కాగ్నిజెంట్ ఆరోపణల్ని ఖండిస్తూ ఇన్ఫోసిస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. లా సూట్‌పై అవగాహన ఉన్నదని, కోర్టులో తాము ఎదుర్కొంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ వారియర్‌ను కాగ్నిజెంట్ తమ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇండియా సబ్సిడరీకి సీఎండీగా ఈ వారమే నియమించడం గమనార్హం. నాస్‌కామ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు కాగ్నిజెంట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి ఇటీవల రాజేశ్ నంబియార్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుత కాగ్నిజెంట్  సీఈవో రవికుమార్ కూడా ఇన్ఫోసిస్‌లో 20 ఏండ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు.