calender_icon.png 29 November, 2024 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకులాలకు 8 మంది సీవోఈలు

29-10-2024 02:35:09 AM

  1. విద్యార్థులకు యూనిఫామ్స్‌తోపాటు 2 జతల నైట్ డ్రెస్‌లు
  2. 104 స్కూళ్లలో ఆర్‌వో ప్లాంట్లు, సోలార్ వాటర్ హీటర్స్
  3. ఒకేషనల్ కోర్సుల సంఖ్య పెంపు
  4. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): గురుకులాల్లో విద్యార్థులకు మెరు గైన సదుపాయాలతోపాటు సమగ్ర వికాసం కోసం కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధికారులతో సోమవారం సచివాల యంలో సమీక్ష నిర్వహించారు.

గత 4 బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగుల్లో తీసుకున్న నిర్ణయాల్లో అమలైన, పెండింగ్ పనులపై మంత్రి పొన్నం ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేలా ప్రస్తుతమున్న సీవోఈల సంఖ్యను రెండు నుంచి పదికి పెంచుతున్నట్టు చెప్పారు.

ప్రస్తు తం విద్యార్థులకు ఇస్తున్న రెండు స్కూల్ డ్రెస్సులు, ఒక స్పోర్ట్స్ డ్రెస్‌తోపాటు రెండు నైట్ డ్రెస్సులు కూడా ఇచ్చే ప్రతిపాదనను మీటింగ్‌లో ఆమోదించారు. 90 ప్రాంతాల్లో ఉన్న 104 గురుకులాల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతీ గురుకుల విద్యా సంస్థల్లో సోలార్ వాటర్ హీటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. హైజెనిక్ కిచెన్‌తోపాటు స్కూల్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. గురుకుల విద్యా సంస్థల్లో 10 పాసైన విద్యార్థులు నవోదయ మాదిరిగానే నేరుగా ఇంటర్‌లోకి చేరేందుకు అనుమతించాలని, ఇంటర్మీడియె ట్ బోర్డుతో అనుసంధానం చేసుకుని విద్యార్థులకు ఉపాధి కల్పించేలా వృత్తివిద్య కోర్సు లు ప్రారంభించాలని సూచించారు.

డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులకు సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేయాలని మీటింగ్‌లో నిర్ణయించారు. వచ్చే వంద రోజుల తర్వాత జరిగే సమావేశంలో సర్వీస్ రూల్స్ ఆమోదించాలని ఆదేశించారు. 

క్రీడలపై దృష్టి సారించాలి..

విద్యార్థులకు క్రీడలపై మరింత దృష్టి సారించాలని మంత్రి సూచించారు. కల్చరల్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్‌పై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యవసరమైనవి పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశించారు.

డ్రింకింగ్ వాటర్ ఆర్వోస్ ప్లాంట్‌లు పూర్తి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో కిచెన్‌లపై ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే అద్దె భవనాలకు 50 శాతం అద్దె చెల్లించినందున నవంబర్ 15లోపు భవనాల్లో అవసరమైన రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

అన్ని గురుకులాల్లో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌పై విద్యార్థులకు అమలు చేయాలని గత సమావేశంలో తీర్మానం చేసుకున్నందున ప్రోగ్రెస్‌పై అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఎంజేపీ స్కూల్ సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీ తిరుపతి, మద్దిలేటి, విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.