- ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ
- ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురి ఎంపిక
- 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు..
- 90వేల మంది విద్యార్థులకు శిక్షణ
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): విస్తరిస్తున్న సాంకేతిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. విద్యార్థి దశ నుంచే సాంకేతికతపై అవగాహన, నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఈక్రమంలోనే ఎస్సీ గురుకుల సొసైటీ ముందడుగు వేసింది. పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు కోడింగ్‌పై ప్రత్యేక శిక్షణను ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు దశలవారీగా కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నది. ఇందుకు టీ వేదికను వినియోగించుకుంటున్నది.
ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు..
రాష్ట్ర వ్యాప్తంగా 238 ఎస్సీ గురుకులాలున్నాయి. ప్రాథమికంగా ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేస్తుండగా మొత్తంగా 1,190 మందికి కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ పొందిన ఈ విద్యార్థులు.. ఒక్కొక్కరు 75 మంది చొప్పున శిక్షణ ఇస్తారు. ఈ లెక్కన 1,190 మంది విద్యార్థులు అన్ని ఎస్సీ గురుకులాల్లోని 89,250 మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రాథమి కంగా ఎంపికచేసిన ఐదుగురు విద్యార్థులకు మూడు లేదా ఆరు నెలలకోసారి కోడింగ్‌పై శిక్షణ ఇస్తూనే ఉంటారు.
6 నుంచి ఇంటర్ వరకు..
కోడింగ్ శిక్షణకు ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. సాంకేతికపై కనీస అవగాహన ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు జోన్ల వారీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకులాలను 7 జోన్లుగా విభజించగా.. ఒక్కో జోన్‌లోని విద్యార్థులకు మూడురోజుల చొప్పున 21 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేయనున్నారు. ఒక జోన్‌లోని విద్యార్థులకు శిక్షణ పూర్తయ్యాకే మరో జోన్‌లోని విద్యార్థులకు శిక్షణ ప్రారంభించనున్నారు.
శిక్షణకు ఏర్పాట్లు..
టీ|హబ్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు తమ పాఠశాలలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన వసతులను ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నా యి. లేని చోట కోడింగ్ శిక్షణలో భాగంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు కోడింగ్ శిక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను సమకూర్చడంతోపాటు నిర్మాణ ఆర్గనైజేషన్ వంటి సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.