* చేతుల మారిన లక్షల రూపాయలు
కామారెడ్డి/నిర్మల్, జనవరి 15 (విజయక్రాంతి): సంక్రాంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా కోడిపందేలు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, పొతంగల్ భోగిపండుగ రోజు సాయంత్రం నుంచి కోడిపందెలు జరిగాయి.
పొతంగల్ మండల పరిధిలోని మంజీరానది శివారు ప్రాంతంతో పాటు హంగర్గా శివారు ప్రాంతంలో పలుచోట్ల నిర్వాహకులు కోడిపందెలు సాగించారు. ఈ సందర్భంగా లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులతో పాటు పోలీస్‌శాఖకు చెందిన కొందరు అధికారుల అండదండలు ఉండటంతో పందెలను జోరుగా సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ కొడిపందేలా నిర్వహణపై ఇంటిలిజెన్స్‌తో పాటు ఎస్‌బీ పోలీసులను విచారణకు ఆదేశించినట్లు సమాచారం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్‌పట్ల గ్రామ శివారులో మంగళవారం కోడి పందేలు నిర్వహించారు.
ఆంధ్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉంటున్న మరో 5గురు ఆంధ్రా వారితో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోని పొలాల్లో రహస్యంగా పందేలు నిర్వహించారు. పందేలు చూడటానికి వచ్చిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా విషయం బయటకు పొక్కింది. వెంటనే రంగంలోకి దిగిన సోన్ పోలీసులు 7గురిని అదుపులో తీసుకున్నారు.