సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్‌లో భారీ స్కామ్
నకిలీ బిల్లులతో సర్కారుకు కోట్ల టోకరా
వైద్యం చేయకుండానే లక్షల్లో దొంగ బిల్లులు
రాష్ట్రంలోని 28 హాస్పిటల్స్‌పై సీఐడీ కేసు
సీఎంఆర్‌ఎఫ్ దందాలో ఖమ్మం దవాఖానలు టాప్
హైదరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి): ఆపత్కాలంలో సామాన్య ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) అక్రమార్కులకు కామధేనువుగా మారింది. చికిత్సలు చేయకుం డానే నకిలీ బిల్లులు సృష్టించి సర్కార్‌కే రూ.కోట్లలో టోకారా పెట్టారు. తాజాగా, ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. సీఎంఆర్‌ఎఫ్ నిధులను దొంగ బిల్లులతో దోపీడీ చేశారని సీఐడీ గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా 28 హాస్పిటల్స్‌పై కేసులు నమోదు చేసింది.
ఎలాంటి వైద్యం చేయకుండానే చేసినట్టు నకిలీ బిల్లులను సృష్టించి రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్మును లూఠీ చేశారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఏ దవాఖాన ఎవరి పేరు మీద ఎంత మొత్తాన్ని దొంగ బిల్లులతో దోపిడీ చేసిందో ప్రాథమిక ఆధారాలతో బయటపెట్టింది. రోగులకు వైద్యం అందిం చినట్టు ఫేక్ కేస్ షీట్లు, బిల్లులను క్రియేట్ చేసి, భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును దోచుకున్నట్టు తేలింది. సీఎంఆర్‌ఎఫ్ డిపార్ట్‌మెంట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డీఎస్‌ఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన సీఐడీ పోలీసులు నిధులను అడ్డగోలుగా దోచుకున్న మాట వాస్తవమేనని నిర్దారించింది. దీంతో ప్రభుత్వం ఆయా దవాఖానలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
దళారులతో చేయికలిపింది ఎవరు?
హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిలా ల్లోని మొత్తం 28 దవాఖానలపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందితోపాటు దళారులుగా అనుమానిస్తున్న కొందరు స్థానికులపై కూడా సీఐడీ అభియోగాలు మోపింది. అయితే విచారణ పూర్తయిన తర్వాత.. అందులో సిబ్బంది హస్తం ఉందా? యాజమాన్యాల పాత్ర ఉందా? అనేది తేలనుంది. దళారుల ప్రోద్బలంతోనే ఈ స్కామ్ జరిగినట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఆ దళారులు ఎవరు? వాళ్ల నెట్‌వర్క్ ఏంటి అనే విషయాలను తెలుసుకునే కోణంలో విచారించనున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మంలో 134, హైదరాబాద్‌లో 22!
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఖమ్మంలో అత్యధికంగా 134 అక్ర మ బిల్లులు, హైదరాబాద్‌లో 22 బిల్లులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో ఏ బిల్లు కూడా రూ.లక్షకు తగ్గకుండా ఉనట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో ప్రతి బిల్లు రూ.1.5 లక్షలకు తగ్గకుండా ఉంది. వీటి ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లోనే దాదాపు రూ.4 కోట్ల స్కామ్ జరిగిన ట్లు తెలుస్తోంది. ఖమ్మంలోనూ అదే స్థాయిలో జరిగినట్టు సమాచారం. మిగతా జిల్లాలను కూడా కలుపుకొంటే స్కామ్ విలువ 10 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు.
ఆ 10వ నంబర్ సంగతేటి?
సీఎంఆర్‌ఎఫ్ స్కామ్‌పై మొత్తం ఆరు ఎఫ్‌ఆర్‌ఐలను మేడ్చల్ మల్కాజిగిరి పోలీసులు నమోదు చేశారు. ఇందులో అన్నింటిలో కలిపి 28 సీరియల్ సంబర్లతో నిందితుల జాబితాను వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో 11 ఆస్పత్రులు ఉన్నట్టు పేర్కొన్నారు. 10వ నంబర్ వద్ద దవాఖాన పేరు చెప్పకుండా ‘ఆల్ అబౌవ్ ద ఎంప్లాయీస్ అండ్ అదర్స్’ అని చేర్చారు. అయితే ఇక్కడ ఆస్పత్రి పేరును పొరపాటున మర్చిపోయారా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇలా నమోదు చేశారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ 10వ నంబర్ సీరియల్ వద్ద హాస్పిటల్ పేరు లేకపోతే అభియోగాలు మోపిన హాస్పిటల్స్ సంఖ్య 27 అవుతుంది.
15 రోజ్లులోగా నివేదిక
28 ఆస్పత్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. ఆ కాపీలను ఆయా జిల్లాల అధికారులకు సీఐడీ బదిలీ చేసింది. అభియోగాలు మోపిన ఆస్పత్రులపై పూర్తిస్థాయిలో విచారణను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎలాంటి తప్పులు లేకుండా విచారణకు సంబంధించిన నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని హైదరాబాద్‌లోని సీఐడీ డీజీ ఆదేశించారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే..
గతేడాది ఏప్రిల్‌కు ముందే సీఎంఆర్‌ఎఫ్ స్కామ్ జరిగినట్టు అభి యోగాలు వచ్చాయి. ఈ క్రమంలోనే సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. తాజాగా సీఐడీ చేసిన ప్రాథ మిక విచారణలో దందా జరిగినట్టు తేలింది. ఇదిలాఉంటే.. ఇదే సీఎంఆర్‌ఎఫ్ నిధుల దుర్వినియోగం కేసులో గతంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు వద్ద పనిచేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై కూడా కేసు నమోదైంది.
వరంగల్‌లో సీఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్‌మాల్!
హనుమకొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్‌మాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొంతమంది అక్రమార్కులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోకుండానే నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 23న హనుమకొండ జిల్లాకు చెందిన ఒక దవాఖాన, మహబూబాబాద్ జిల్లాకు చెందిన రెండు హాస్పిటల్స్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. హనుమకొండ రోహిణి మెడికేర్ ఆస్పత్రిలో నలుగురు చికిత్స చేయించుకున్నట్టు బిల్లులు రూపొందించి సీఎంఆర్‌ఎఫ్ కింద డబ్బులు క్లెయిమ్ చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
విచారణలో మాత్రం ఒక్కరే చికిత్స చేయించుకున్నట్టు తేలింది. మిగతా ముగ్గురు తమ ఆస్పత్రిలో చేరలేదని, వారికి ఎటువంటి చికిత్స అందించినా దాఖలాలు లేవని సీఐడీ అధికారులకు యాజమాన్యం చెప్పినట్లు సమాచారం. చికిత్స చేయించుకున్న రోగులు అందరూ కూడా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వారు కావడం, ఆ జిల్లాకు సంబంధించి సంజీవిని, సిద్దార్థ దవాఖానలపై కూడా కేసులు నమోదవడంతో ఈ వ్యవహారం అంతా అక్కడి నుంచే నడిచిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రెండు ఆస్పత్రులు కూడా ప్రస్తుతానికి మూసివేశారని తెలుస్తోంది. ఆ ఆస్పత్రుల యాజమాన్యాలను విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటికొచ్చే అవకాశాలున్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
సీఐడీ తన పని తాను చేస్తుంది: సుబ్బారావు, డీఎంహెచ్‌వో, ఖమ్మం
ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఆస్పత్రుల గురించి ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీ సుబ్బారావు స్పందించారు. అది తమ పరిధిలోని అంశం కాదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. దానితో తమకెటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత మూడు నాలుగు నెలులుగా సీఐడీ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. యాజమాన్యాలు, సిబ్బందిని విచారిస్తున్నారని, ఈ నకిలీ బిల్లులు ఎక్కడ నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తూ నిజాలను బయటకు తీసే పని చేస్తున్నారని చెప్పారు. అక్రమాలు పాల్పడినట్లు రుజువైతే ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు మోపిన దవాఖానల జాబితా
ఖమ్మం
గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం
డాక్టర్ జేఆర్‌ప్రసాద్ హాస్పిటల్ ఖమ్మం
శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం
శ్రీసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం
వైష్ణవి హాస్పిటల్ ఖమ్మం
సుజాత హాస్పిటల్ ఖమ్మం
న్యూ అమృత హాస్పిటల్ ఖమ్మం
ఆరెంజ్ హాస్పిటల్ ఖమ్మం
మేఘశ్రీ హాస్పిటల్ ఖమ్మం
శ్రీకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం
హైదరాబాద్/రంగారెడ్డి
హిరణ్యా హాస్పిటల్ మీర్‌పేట్
డెల్టా హాస్పిటల్ హస్తినాపురం
శ్రీ రక్ష హాస్పిటల్ బీఎన్ రెడ్డి నగర్
ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్డు
ఏడీఆర్‌ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రామంతపూర్
ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట
శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరామలగూడ
అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు
శ్రీ కృష్ణ హాస్పిటల్ సైదాబాద్
కరీంనగర్
సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంట
శ్రీ సాయి హాస్పిటల్ (మెటర్నిటీ, సర్జికల్) పెద్దపల్లి
వరంగల్
రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమకొండ
శ్రీ సంజీవిని హాస్పిటల్ మహబూబాబాద్
సిద్ధార్థ హాస్పిటల్ మహబూబాబాద్
నల్లగొండ
నవీన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ
మహేశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ
అమ్మ హాస్పిటల్ నల్లగొండ