తుది దశకు చేరిన ఓఆర్‌ఆర్ ఫేస్-2 పనులు
రూ. 1200కోట్లతో 2742 కిలోమీటర్ల పైపులైన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తరించి ఉన్న కాలనీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీరు సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్‌ఆర్ ఫేస్ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో బోర్లు, ఇతర నీటి వనరులపై ఆధారపడ్డ కాలనీల ప్రజలకు జల మండలి అతి త్వరలో నల్లా నీటిని అందించబోతుంది. కాగా ఫేజ్‌త పనులను 2022 జనవరి 24న నాటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అందుకోసం ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్ ఫేస్ 2 పేరిట సుమారు రూ. 1200 కోట్ల వ్యయంతో 138 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల 73 సర్వీసు రిజర్వాయర్లు, 2742 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఓఆర్‌ఆర్ పరిధిలోని 12 మండలల్లో 20లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతున్నది. ఓఆర్‌ఆర్ ఫేస్ పనులను రెండు ప్యాకేజీలలో పూర్తి చేస్తున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. కాగా గ్రేటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నీటిని అందించడం కోసం ఇప్పటికే రూ. 700కోట్ల వ్యయంతో ఓఆర్‌ఆర్ ఫేస్ పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. 2036 నాటికి ఓఆర్‌ఆర్ పరిధిలోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో జనాభా 34 లక్షలకు పెరుగుతున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జనాభా అవసరాలకు తగ్గట్టుగా నీటిని అందించడం కోసం అధికారులు ఫేస్ పనులను చేస్తున్నారు. ఇది పూర్తయితే 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రెండు ప్యాకేజీల్లో పనులు
ఓఆర్‌ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టు పనులను ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 అనే పేరిట చేస్తున్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర మండలాలు ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి. ఈ ప్యాకేజీ పనుల కోసం రూ. 613 కోట్లు వ్యయంతో, 1522 కిలోమీటర్ల పైపులైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 33 సర్వీసు రిజర్వాయర్లు ఉంటాయి. వాటిలో దాదాపు అన్ని రిజర్వాయర్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలినవి పూర్తి కావలసి ఉంది. పనులు పూర్తయితే 10లక్షల మందికి ప్రయోజనం కలుగుతున్నది.
కాగా రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, ఆర్సీపురం, బొల్లారం మండలాలు ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి. రూ. 587కోట్లతో ఈ ప్యాకేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్యాకేజీలో 38 సర్వీసు రిజర్వాయర్లు, 1250 కిలోమీటర్ల పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 20రిజర్వాయర్లు పూర్తయ్యాయి. మిగతావి తుది దశలో ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే 10లక్షల మంది జనాభాకు లబ్ధి జరుగుతుంది. రెండు ప్యాకేజీల్లో పనులు పూర్తయితే సుమారు 2 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్లకు సరిపడా నీటి సరఫరా జరుగుతుంది.
ఎస్టీపీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
అత్తాపూర్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీలను వేగంగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. అత్తాపూర్ నిర్మిస్తున్న ఎస్టీపీని, హసన్‌నగర్ లోని ఐఅండ్‌డీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యమైనప్పటికీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకో వాలని సూచించారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మిరాలం ఎస్పీటీని, మిరాలం చెరువును సందర్శించారు. సమీప కాలనీల నుంచి చెరువులోకి మురుగు చేరు పాయింట్లను గుర్తించారు.
ఆ మురుగు చెరువులో చేరకుండా చెరువు చుట్టూ ఉన్న పైపులైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మళ్లింపు పనుల కోసం జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారుల సమన్వయంతో పను లు పూర్తి చేయాలని సూచించారు. పని జరిగే ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ 2, సీజీఎం సుదర్శన్, జీఎం, ఎస్టీపీల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.