calender_icon.png 2 February, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి డిమాండ్ మేరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలి

01-02-2025 10:20:31 PM

రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు  ఉత్పత్తి, రవాణా

నాణ్యమైన, రక్షణతో  కూడిన  బొగ్గు ఉత్పత్తికి జీఎంలు చర్యలు తీసుకోవాలి

సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఆదేశం...

మందమర్రి (విజయక్రాంతి): రానున్న వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా  థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతీ రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఅండ్ఎండి మాట్లాడారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వేసవి సమీపిస్తోండటంతో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏరియాలలో ప్రణాళికాబద్ధంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. కర్ణాటక పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ నుండి వస్తున్న డిమాండ్ మేరకు రోజుకు 11 రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలని, అలాగే సింగరేణి తో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కొత్తగూడెం ఏరియా మెరుగైన బొగ్గు ఉత్పత్తి సాధించడంపై ఏరియా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్న ఏరియాలు పుంజుకొని సమిష్టిగా పనిచేయాలన్నారు.  బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు  ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నాణ్యమైన బొగ్గును మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని, అలాగే ప్రతీ కార్మికుడు కూడా స్వీయ రక్షణచర్యలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. నాణ్యత, రక్షణ విషయంలో ఏరియాలోని అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతం గా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జీఎం (కో ఆర్డినేషన్) ఎస్డి ఎం సుభానీ, జీఎం (మార్కెటింగ్)  రవి ప్రసాద్, జీఎం (సీపీపీ)  మనోహర్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.