calender_icon.png 2 April, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 78 శాతం బొగ్గు ఉత్పత్తి

31-03-2025 06:23:50 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్..

మందమర్రి (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో కేవలం 78 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గిందని ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. ఏరియాలోని జిఎం కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఏరియాకు గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 34.6 లక్షల టన్నులకు గాను 27.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందన్నారు.

ఏరియాలోని కేకే 5 గని 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, కాసిపేట గని 62% కాసిపేట 2 గని 59%, శాంతిఖని 47%, ఆర్కేపి ఓసి 139%, కేకే ఓసీలో 63% బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందన్నారు. ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలలో ఏడు లక్షల 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడిందని రానున్న రోజుల్లో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి మెరుగుపరిచి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏరియాలోని శాంతిఖనిలో మూడవ సీమ్, నాలుగో సీమ్ లలో త్వరలో రెండు నూతన ప్యానెల్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నూతన మ్యాన్ రైడింగ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని శాంతిఖనిలో నూతన ప్యానల్ ద్వారా బొగ్గు ఉత్పత్తి మెరుగుపడుతుందన్నారు. అంతేకాకుండా నూతనంగా లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగిందన్నారు.

681 హెక్టార్ల భూసేకరణ జరిపి 8 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయనున్నామని వివరించారు. కేకే 5 గనికి మరో నాలుగు సంవత్సరాల జీవితకాలం ఉందని త్వరలో నూతన ప్యానెల్ ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి మెరుగుపరుస్తామన్నారు. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు 27.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిర్దేశించడం జరిగిందని నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అవకాశాలు ఉన్నాయని కార్మికులు అధికారులు యూనియన్  నాయకుల సమిష్టి కృషితో వచ్చే ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, ఐఈడి రాజన్న, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డివైఎస్ఈ సివిల్ రాము, ఏజిఎం వెంకటరమణ, డివైపిఎం మైత్రేయ బంధులు పాల్గొన్నారు.