calender_icon.png 15 January, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో నైనీలో బొగ్గు ఉత్పత్తి

18-07-2024 12:50:13 AM

నిర్వాసితులకు మెరుగైన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందించండి

అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూలై 17(విజయక్రాంతి): నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని, ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివా లయంలో  నైనీ బొగ్గు బ్లాకు పై ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్,  సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని సూచించారు.

స్థానిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని చెప్పారు.  నెనీ బ్లాక్‌కు అన్ని అనుమతులు లభించాయని, ఈ క్రమంలో ఒడిశా అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు తదితర సమస్యలను పరిష్కరించి.. భూముల అప్పగింతపై ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. ఈ క్రమంలో అధికారులు ఆ రాష్ర్ట అటవీశాఖతో నిరంతరం  సంప్రదింపులు జరుపుతూ..  పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆదేశించారు. ఈ సంప్రదింపుల ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భట్టి ఆదేశించారు. హై టెన్షన్ విద్యుత్తు లైన్‌ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ర్ట విద్యుత్ శాఖతో సంప్రదిస్తూ ముందుకు సాగాలన్నారు.

సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాకుపై ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని సమస్యలకు పరిష్కారానికి కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుంటామని , ఈ మేరకు శక్తి వంచన  లేకుండా కృషి చేస్తామని వివరించారు. నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి ఇటీవల ఒడిశాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి.. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో చర్చించారు. ఈ నేపథ్యంలో నైనీ బ్లాక్‌లో ఉత్తత్పత్తికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలిగేలా.. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. సమీక్షలో స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఇంధన శాఖ ఓఎస్‌డీ సురేందర్ రెడ్డి, కో ఆర్డినేషన్ జీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.