calender_icon.png 3 October, 2024 | 5:59 AM

బొగ్గు ద్వారా విద్యుదుత్పత్తి ప్రకృతి ధ్వంసం

03-10-2024 01:49:57 AM

దేశంలో 85 శాతం ఇదే విధానంలో విద్యుదుత్పత్తి

షార్ట్ ఫిల్మ్ విడుదలలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): యూకేతో పాటు మరికొన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసం రానున్న రోజుల్లో కోల్ ఆధారిత విద్యుదుత్పత్తిని నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో 85 శాతం కోల్ ఆధారితంగానే కరెంట్ ఉత్పత్తి అవుతుందని, దీని ద్వారా ప్రకృతి ధ్వంసమవుతోందన్నారు. పర్యావరణ స్పృహను పెంపొందించేలా థియా వేదుల రూపొందించిన టుమారో విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనే షార్ట్ ఫిల్మ్‌ను బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో మంత్రి విడుదల చేశారు.

పర్యావరణ పరిరక్షణ గొప్పతనాన్ని చాటు తూ హైదరాబాద్ విద్యార్థిని చక్కని షార్ట్ ఫిల్మ్ రూపొందించారని అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. భూమాతను పరిరక్షించుకునేలా ఏక్ పేడ్ మాకే నామ్.. పిలుపుతో ప్రధాని గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్‌ను ప్రజా ఉద్యమంలా చేపట్టాలి 

స్వచ్ఛ భారత్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రజా ఉద్య మంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం సికింద్రాబాద్ ప్యారడైజ్  కలాసిగూడ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేశారు. అంతకు ముందు ఎంజీ రోడ్‌లోని  మహాత్మాగాంధీ చౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళిర్పించారు.  జాతిపిత గాంధీ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారన్నారు.