calender_icon.png 23 February, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

౩ బొగ్గు బస్సులు.. 10 మంది సిబ్బంది వనపర్తి డిపో వహ్వా!

23-02-2025 12:39:10 AM

నిజాం కాలంలో.. హైదరాబాద్ డిపో తర్వాత రెండోది 

 వనపర్తి, (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోను చూసినవారెవరు ఆ డిపోకు దాదాపు శతాబ్దకాలపు చరిత్ర ఉన్నదని అనుకోరు. స్వాతంత్య్రం రాకముందే వనపర్తిలో బొగ్గుబస్సు ప్రయాణం అందుబాటులో కి వచ్చింది. అప్పట్లో బొగ్గును మండించడం ద్వారా వచ్చే నీటిఆవిరితో బస్సులు నడిపేవారు.

వీటిని స్టీమ్ బస్సులు అని పిలిచేవారు. ఇలాంటి బస్సులు ఆనాడు మూడు ఉండేవి. నిజాం సంస్థానంలో ఒక రాజ్యంలా ఉన్న వనపర్తి సంస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో వనపర్తి రైల్వేరోడ్డు ఉండేది. ప్రస్తుతం  అది మదనాపురం రైల్వేస్టేషన్. పట్టణానికి రైల్వేస్టేషన్ సమీపంలో ఉండటంతో రాజుల కాలంలో.. వనపర్తి సంస్థాన పరిధిలో 1932లోనే వనపర్తి డిపోను ఏర్పాటు చేశారు.

ఈ డిపో నిజాం కాలంలో.. హైదరాబాద్ డిపో తర్వాత రెండోది కావడం విశేషం. అప్పటినుంచి  ఇప్పటివరకు ఈ డిపో నిరంతరాయంగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. నిజాం కాలంలో నిజాంరాష్ట్ర రైల్వే రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపో (ఎన్‌ఎస్‌ఆర్‌ఆర్‌డీ) పేరిట 1932లో వనపర్తిలో డిపోను ఏర్పాటు చేశారు.

మూడు బొగ్గుబస్సులతో ప్రారంభం కాగా మొత్తం 10 మంది దాకా కార్మికులు  పనిచేసేవారు. ప్రస్తుతం 102 బస్సులు ఉండగా ఇందులో 44 ప్రైవేటు,  58 ఆర్టీసీ సంస్థకు సంబంధించిన బస్సు లు (సూపర్ లగ్జరీ 2, డీలక్స్ 13, ఇతర బస్సులు ఎక్స్‌ప్రెస్‌లు, పల్లె వెలుగులు) ఉండగా 413 మంది సిబ్బంది (డ్రైవర్స్, కండక్టర్లు, మెకానిక్‌లు) పనిచేస్తున్నారు.