- బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్ సేవలు వినియోగించుకుంటాం
- టీజీఎస్పీ ఒకటో బెటాలియన్ పాసింగ్ పరేడ్‌లో డీజీపీ జితేందర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) విభాగంలో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా బాక్సింగ్, క్రికెట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారులు నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌లను రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్పీలో డీఎస్పీలుగా నియమించినందున, వారి సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ యూసుఫ్‌గూడ ఒకటో బెటాలియన్ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి డీజీపీ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ లో తెలంగాణ ఖ్యాతిని చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం టీజీఎస్పీలో ఉన్నారని గుర్తుచేశారు. వీరి ఆధ్వర్యంలోనే టీజీఎస్పీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.
టీజీఎస్పీ సిబ్బంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేవలు చేసినందున శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతో మంచి పేరు ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,077 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయ్యిందన్నారు. యూసఫ్‌గూడ బెటాలియన్‌లో 548 మందికి శిక్షణ పూర్తయిందని చెప్పారు.
టీజీఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 4,077 కానిస్టేబుళ్లలో 2,746 గ్రాడ్యుయేట్స్, 596 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 62 మంది ఎక్స్‌సర్వీస్‌మెన్లు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో కమాండెంట్ మురళి కృష్ణ, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీజీఎస్పీ బెటాలియన్లలో శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు జరిగాయి. టీజీఎస్పీ మూడో బెటాలియన్‌లో ఇంటెలిజెన్స్ డీజీపీ బీ శివధర్‌రెడ్డి, నాలుగో బెటాలియన్‌లో ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ జోషి, ఏడో బెటాలియన్‌లో నిజామాబాద్ ఇన్‌చార్జి సీపీ సింధూశర్మ, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్, పదో బెటాలియన్‌లో ఐజీపీ వీ సత్యనారాయణ, 12వ బెటాలియన్‌లో ఐజీపీ ఎం రమేశ్, 13వ బెటాలియన్‌లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, 15వ బెటాలియన్‌లో ఖమ్మం సీపీ సునీల్‌దత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.