calender_icon.png 29 November, 2024 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ

29-11-2024 01:20:58 AM

  1. అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ 
  2. ఏడాదికి 600 కోచ్‌ల ఉత్పత్తి  

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై తెలం గాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో చెప్పిన విధంగా కాజీపేటలో కోచ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని కేంద్ర రైల్వేశాఖ కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం హమీ ఇవ్వగా.. దానికి బదులుగా 2023లో వ్యాగన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చివరకు ఇప్పుడు వ్యాగన్ వర్క్‌షాప్‌ను కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అప్‌గ్రేడ్ చేయాలని 2023 జూలై 5న ద.మ. రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖరాసింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ (లింక్ హోఫ్‌మ న్ బుష్), ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లు తయారు చేసేందుకు వీలుగా యూనిట్‌ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది (2024) సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలు జారీచేసింది.

కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే బోర్డు సూచిం చింది. విభజన హామీల అమలుపై రాష్ర్ట అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం తెలిపారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మంజూరు అయినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ గత నెల 24వ తేదీనే ప్రకటించారు. 

600 కోచ్‌ల తయారీ..

రూ. 680 కోట్లతో ఈ కోచ్ ఫ్యాక్టరీ పను లు చేపట్టనున్నారు. ఏడాదికి 600 కోచ్‌ల తయారీ లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ పనిచేయనుం ది. ఈ కోచ్ ఫ్యాక్టరీ వల్ల సుమారు 3వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏప్రి ల్ 2025 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించేలా కేంద్రం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా ఇప్పటికే కేంద్ర  మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

కల నెరవేరిందిలా...

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల కల. 2014లో రాష్ర్ట విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్ సర్కారు ఇందుకోసం 150 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. 2017లో దేశంలో ఎక్కడ కూడా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్రం చేసిన ప్రకటన స్థానికులకు నిరాశను కలిగించింది.

2018 ఏప్రిల్‌లో లాతూర్(మహారాష్ర్ట)లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తిరిగి ఆశలు చిగురించాయి. తెలం గాణ నుంచి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఒత్తిడితో పాటు బీజేపీకి తెలంగాణలో ఆదరణ పెరగడంతో కేంద్రంలోనూ ఆలోచన మొదలైంది.

ఫలితంగా 2023 జూలై 8న కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ భూమి పూజ చేయగా... రూ.521కోట్లతో 2025 లోగా పూర్తయ్యేలా పనులు చేపట్టారు. ఇప్పుడు ఎట్టకేలకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడంతో వరంగల్ తో పాటు రాష్ర్ట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విభజన హామీలు సాధించుకుంటున్నం: సురేఖ

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని మంత్రి కొండా సురేఖ గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రె స్ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తయారీ యూనిట్‌ను మంజూ రు చేసిందని పేర్కొన్నారు.

కాజీపేట రైల్వేస్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్రం కార్యాచరణను ప్రారం భించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పటికే వరంగల్ చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టును సాకారం చేసుకోవడం ప్రభుత్వం సాధించిన విజయమని స్పష్టం చేశారు. 2041 మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వరంగల్ సమగ్రాభివృద్ధికి మంజూరు చేసిన రూ.4,962.47 కోట్లతో అమలు చేస్తున్న ప్రణాళికలు వరంగల్ నగర రూపులేఖల్ని మార్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరం ఆవిర్భవించే రోజు మరెంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.