calender_icon.png 29 September, 2024 | 8:55 PM

సహకార సొసైటీ ఆఫీసుకు తాళం

29-09-2024 12:23:47 AM

న్యాయం చేయాలని రైతు డిమాండ్

అలంపూర్, సెప్టెంబర్ 28: గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దపోతుల పాడు గ్రామ శివారులో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయానికి శనివారం ఓ రైతు తాళం వేశాడు. పెద్దపోతుల పాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలో ఓ రైతు రుణం తీసుకుని చెల్లించలేదు. దీంతో ఆ  రైతుకు చెందిన మూడెకరాల భూమిని సొసైటీ స్వాధీనం చేసుకుని, గతంలో బహిరంగ వేలం నిర్వహించింది.

మానవపాడు మండల కేంద్రానికి బోయ సాయిబాబా అనే రైతు ఎకరాకు రూ.12.10లక్షల చొప్పున రూ.36.10 లక్షలకు పాడి మూడు ఎకరాలను దక్కించుకున్నాడు. అధికారుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఆ భూమిలో సాయిబాబా సాగు చేసిన పంటను.. సొసైటీకి బాకి పడిన వ్యక్తి భూమి తనదంటూ పదే పదే దున్నుతూ వస్తున్నాడు.

రాజకీయ నాయకులను కూడా వెంట తెస్తుండటంతో అధికారులు కూడా చేతులెత్తుశారు. దీంతో విసుగు చెందిన సాయిబాబా శనివారం సొసైటీ కార్యాలయానికి తాళం వేశాడు. బహిరంగా వేలంలోనే తాను భూమిని దక్కించుకున్నా పాత యజమాని ఎందుకు అడ్డుకుంటున్నాడని సొసైటీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్‌ను నిలదీశాడు. అలాంటప్పుడు వేలం పాట ఎందుకు వేశారని మండిపడ్డాడు. తనకు జరిగే వరకు కార్యాలయాన్ని తెరవనిచ్చేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.