27-03-2025 01:42:52 AM
సూర్యాపేట, మార్చి 26: జిల్లాలో సాగునీరు లేక రైతులు సాగుచేస్తున్న పంట ఎండిపోయి రోదిస్తుంటే వారిని ఎక్కించేందుకే అన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నట్లు ఉందని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం గ్రామం, తాండాలలో ఎండిన పంటలపొలాలను పరిశీలించి మాట్లాడారు.
సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని మళ్ళీ కన్నీళ్లపాలు చేసిన పాపం కాంగ్రెస్ దేనని విమర్శించారు. రైతులకు కెసిఆర్ రూ. 10, 000 ఇస్తుంటే, మేము రూ. 15, 000 ఇస్తామని ఆశ పెట్టి మోసం చేశారని తెలిపారు.
ఎండిపోయిన పంట పొలాల గురించి, రైతన్నల కష్టాల గురించి ఏఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. దావతుకు పోయేందుకు హెలికాప్టర్ దొరుకుతుంది, కానీ ఎండిన పొలాలు పరిశీలించడానికి మాత్రం మంత్రులకు సమయం దొరకట్లేదన్నారు.
మళ్లీ తెలంగాణలో ఆంధ్ర బానిసలుగా పాలన కొనసాగిస్తున్న దుస్థితి వచ్చిందన్నారు. ఇకనైనా కనీసం ఒక్క తడికి నీళ్లిస్తే కొంత మంది రైతులన్నా అప్పుల బారిన పడకుండా ఉంటారని, స్థానిక మంత్రి ఉత్తమ్ స్పందించి ఇంకోక్కతడికి నీళ్లివ్వాలని కోరుతున్నాని తెలిపారు.