calender_icon.png 22 January, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు

03-07-2024 12:44:53 AM

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్  

జూలై 15 నుంచి అమల్లోకి

ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 2 (విజయక్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ నిధులకు సంబంధించిన దరఖాస్తులను ఇకనుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. సీఎంఆర్‌ఎఫ్ నిధులు పక్కదారి పట్టకూడదని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే  ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.

ఇకముందు సీఎం సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సులేఖలను జతచేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్ కు సంబంధించి ఒక కోడ్ ఇవ్వనున్నారు. దాని ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయం లో అందజేయాలి. ఆన్‌లైన్ ద్వారా చేసిన అప్లికేషన్‌ను సంబంధిత దవాఖానలకు పంపించి నిర్దారించుకుంటారు.

వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్‌ను ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్‌పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నంబర్‌ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారుల కు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్‌ఎఫ్ ధరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. త15 నుంచిhttps//cmrf.telangana.gov.in\ వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమూనా అందుబాటు లో ఉంటుంది.