ఏడాదిలో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం
1.66 లక్షల కుటుంబాలకు లబ్ధి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కామారెడ్డి (విజయక్రాంతి): దళారుల ప్రమేయం లేకుండా సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాహాయంలో సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం కావాలంటే దళారులకు దరఖాస్తులు అప్పగించి పర్సంటేజీలు ఇవ్వాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఏడాదిలో 830 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ కింద 1.66 లక్షల మంది లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
జుక్కల్ మండలంలో పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 13 వేల మందికి 240 కోట్ల విలువ చేస్తే ఎల్ఓసిలు మంజూరు చేశామని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే నేరుగా చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను పంపిణీ చేశారు. అనంతరం జుక్కల్ మండలం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, మనోహర్, సంపత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లికార్జున పటేల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.