23-04-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులను దుర్వినియోగం చేసిన ఆరు దవాఖానలను సీజ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బీ.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సరూర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
హస్తినాపురం లోని డెల్టా హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని బీడీ రెడ్డి గార్డెన్స్ రోడ్డులోని శ్రీ రక్షా హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని హిరణ్య హాస్పిటల్, బైరామల్ గూడ లోని మోహన్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, సాయి తిరుమల హాస్పిటల్, సరూర్ నగర్ లోని ఎంఎంవీ ఇందిరా హాస్పిటల్, సాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లలో నిబంధనలకు విరుద్ధంగా సిఎంఆర్‌ఎఫ్ నిధుల కోసం నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు.
ఈ విషయం సాధారణ పరిపాలన విభాగం అధికారులు, సీఐడీ అధికారులు చేసిన విచారణలో నిధులు దుర్వినియోగం చేసిన విషయం బట్టబయలైంది. దర్యాప్తు అధికారుల సూచనలతో డీఎంహెచ్ వో వెంకటే శ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్ వో గీత వైద్యసిబ్బందితో కలిసి శనివారం హాస్పిటల్స్ ను సీజ్ చేశారు. ఇందులో హిరణ్య హాస్పిటల్, ఎంఎంవీ ఇందిరా హాస్పిటల్స్ ను శనివారం సీజ్ చేయగా, మిగిలిన నాలుగు హాస్పిటల్స్ ఇప్పటికే ముసివేశారు.
ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్‌ఎంపి వ్యవస్థకు వ్యతిరేకం కాదని, డాక్టర్ పేరు లేకుండా వైద్యం చేసుకోవచ్చునని తెలిపారు. ఇటీవల షాద్ నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్ హఫీజ్ పేట్ లో కొన్ని హాస్పిటల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. నకిలీ వైద్యం చేసేవారిని నివారించడానికి కృషి చేస్తున్నామన్నారు.
ప్రాథమిక చికిత్స పెట్టుకోవచ్చు కానీ, అంతకు మించి హస్పిటల్ పెట్టుకుని బెడ్ లు ఏర్పాటు వేసుకుని వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించారు. ఇప్పుడు సీజ్ చేసిన దవాఖానలను సాధారణ పరిపాలన విభాగం సీఐడీ నుంచి క్లీన్ చీట్ వస్తే తప్పా వాటిని తెరిచే ప్రసక్తి లేదని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ గీత, మ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పూనమ్, సరూర్ నగర్ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ అర్చన, జిల్లా మీడియా అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.