calender_icon.png 26 October, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ ధాన్యం ఫలహారం!

26-10-2024 01:33:27 AM

  1. రూ.కోట్ల విలువైన వడ్లను బుక్కిన మిల్లర్లు
  2. నామ్ కే వాస్తేగా యాంత్రాంగం కేసులు నమోదు
  3. ఆర్‌ఆర్ యాక్ట్ పెడతామంటూ కాలం వెల్లదీత
  4. తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు

మంచిర్యాల, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ సొమ్మును కొందరు రైస్ మిల్లర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బును సొంతానికి వాడుకొని దర్జాగా కాలం వెల్లదీస్తున్నారు.

సీఎంఆర్ ధాన్యంపై దృష్టి సారించాల్సిన అధికారులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లను ‘మామూలు’గా తీసుకుని వారిపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 19 బాయిల్డ్, 35 రా రైస్ మిల్లులకు 1,39,664 మెట్రిక్ టన్నుల ధాన్యం డీఆర్డీఏ ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా వెళ్లింది.

ప్రభుత్వానికి (సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ) సీఎంఆర్ రూపంలో 94,057 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 61,467.530 మెట్రిక్ టన్నులు (65 శాతం) ఇవ్వగా, ఇంకా 32,589.470 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉన్నది. అలాగే యాసంగిలో 19 బాయిల్డ్ రైస్ మిల్లులకు, 14 రా రైస్ మిల్లులకు 85,266.520 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, సీఎంఆర్ కింద 57,873.654 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.

ఇప్పటివరకు 27,408.316 మెట్రిక్ టన్నుల (47 శాతం) బియ్యం ప్రభుత్వానికి ఇవ్వగా, 30,465.338 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. సీఎంఆర్ ఇచ్చేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా ఇందులో కొందరు మిల్లు యాజమానులు ఇప్పటికే ఉన్న ధాన్యం అమ్ముకొని మిల్లులను ఖాళీగా ఉంచడం గమనార్హం.

నామ్ కే వాస్తేగా కేసులు... 

కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు పంపిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి తిరిగి ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే ప్రక్రియలో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తుండడం మిల్లర్లకు వరంగా మారిం ది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లో ఇటీవల అధికారులు రెండు మిల్లుల యాజమానులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

గతంలో ఒక మి ల్లును సీజ్ చేసిన ఎంతో కాలం తర్వాత అధికారులు మిల్లు యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం విశేషం. ఇప్పుడు మరో 15 మిల్లులపై ఆర్‌ఆర్ (రెవెన్యూ రికవరీ) యాక్టు పెడుతామంటూ కాలం వెల్లదీస్తున్నా రు. ముందు నుంచే మిల్లులపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.

సొంతానికి వాడుకుని..

జిల్లాలో కొన్ని రూ.కోట్లు విలువ చేసే ప్ర భుత్వ సొమ్మును యాజమాన్యాలు వారి సొంతానికి వాడుకున్నట్లు తేలింది. సివిల్ సప్లయ్ అధికారుల అంచనా మేరకు ముదిగుంట బీఎస్‌వై రైస్ మిల్లు రూ.19 కోట్లు, లక్షెట్టిపేట కొత్తూరు జైయోగేశ్వర ఇండస్ట్రీ రూ.7 కోట్లు,  కుందారం అన్నపూర్ణ ఆగ్రో మోడరన్ రైస్ మిల్లు రూ.3 కోట్లు, రేచిని వాసవీమాత ఆగ్రో ఇండస్ట్రీ రూ.4 కోట్లు, కో టపల్లి శ్రీవెంకట రమణ ఆగ్రో ఇండస్ట్రీ రూ.9 కోట్లు, కలమడుగు శ్రీలక్ష్మీ నర్సింహా మోడ్రన్ రైస్ మిల్లు యాజమాన్యం రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని అమ్మి సొమ్ము చే సుకున్నాయి.

ఇప్పటికే లక్ష్మీపూర్ మాతేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.7 కోట్లు, నర్సింగాపూర్ దుర్గా ఇండస్ట్రీస్ రూ.10 కోట్ల విలువై న ధాన్యం గోల్‌మాల్‌పై ఆర్‌ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మిగతా మిల్లుల్లోనూ వెరిఫికేషన్ పూర్తయితే మరిన్ని అక్రమాలు బయటపడనున్నాయి. 

కీలుబొమ్మలుగా అధికారులు...

మిల్లుల్లో నిల్వ ఉన్న ప్రభుత్వ ధాన్యాన్ని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉన్నది. కానీ, కానీ రైస్ మిల్లర్ అసోసియేషన్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు అధికారులు మిల్లర్లు ఇచ్చే తాయి లాలకు లొంగి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

గతంలో సివిల్ సప్లయ్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలోని మూడు మిల్లు ల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. గోదాంల్లోని నిల్వలపై మిల్లర్లు పొంతన లేని సమాధానాలు ఇవ్వగా, అధికారులు వెంటనే ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు. ఈ తతంగం బయటకు పొక్కకుండా, జిల్లాస్థాయి అధికారులు ‘మామూలు’ వాటిని తనిఖీలుగా ప్రకటించి విషయం బయటకు రాకుండా చేశారనే విమర్శలు నాడు బాహాటంగానే వినిపించాయి.

ధాన్యం అమ్ముకుంటే చర్యలు తప్పవు.. 

     ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకుంటే శాఖాపరంగా చర్యలు తప్పవు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతీలాల్ ఆదేశాల మేరకు మిల్లులకు కేటాయించిన ధాన్యం, ప్రభుత్వానికి ఇచ్చిన సీఎంఆర్, మిల్లుల్లో మిగిలిన ధాన్యం లెక్కలు సరి చూస్తున్నం. ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే వారిపై ఆర్‌ఆర్ యాక్టు, కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రెండు మిల్లుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేశాం.

 శ్రీకళ, పౌర సరఫరాల సంస్థ డీఎం, మంచిర్యాల