03-03-2025 01:15:26 AM
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో పగలు కుస్తీ.. రాత్రి దోస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆదివారం ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సహాయక పనులను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నేతలకు స్వాగతం పలికి, బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడాన్ని చూస్తే సీఎంకు బీజేపీతో ఎంత దోస్తీ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చేతనైతే కృష్ణా జలాల చౌర్యానికి పాల్పడుతున్న ఏపీ సీఎం చంద్రబాబుపై యుద్ధం ప్రకటించాలని, తద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై నోరు పారేసుకోవడం తప్ప సీఎంకు ఏమీ తెలియదని మండిపడ్డారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపర మైన విషయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే కార్మికులు మృత్యు కుహరం లోకి వెళ్లారని అభిప్రాయపడ్డారు. సీఎంకు నిజాయితీ ఉంటే ఎస్‌ఎల్‌బీసి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.3,900 కో ట్లు ఖర్చు చేసి 2014 23 వరకు ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టామని, 11.48 కిలోమీటర్ల మేరకు సొరంగం తవ్వించామని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన రోజుల్లో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు నాడు రేవంత్‌రెడ్డి ఊడిగం చేశారని గుర్తుచేశారు.
ఇప్పుడు కూడా చంద్రబాబును నొప్పించకూడదనే సీఎం కృష్ణా జలాల చౌర్యంపై నోరు మెదపడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని గుర్తుచేశారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖ లైన కేసుల కారణంగా ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
కాంగ్రెస్ నాయకులు సృష్టించిన అడ్డంకులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం 80శాతం పనులు పూర్తి చేశామని, కేసుల్లేకుండా తమ హయాంలోనే పనులు పూర్తయ్యేవన్నారు. ‘దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గత నెల 21న నేను అబుదాబీకి వెళ్లిన.
22వ తేదీన ఎస్‌ఎల్‌బీ ప్రమాదం జరిగింది. నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికో.. జల్సాల కోసమో విదేశాలకు వెళ్లలేదు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు.
సీఎంకు అది మొదటి నుంచీ అలవాటే. ప్రమాదం గురించి పట్టించుకోకుండా సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పైనే దృష్టి సారించారు. సీఎం ఇప్పటికైనా మాపై లేనిపోని ఆరోపణలు మానుకో’ అంటూ నిప్పులు చెరిగారు.