హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్లతో చర్చించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 4న జరిగిన తెలంగాణ కేబినేట్ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపారు.
రైతు భరోసా వ్యవసాయ భూములకు ఇస్తామని, పథకం అమలు తీరుపై చర్చించారు. ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీల వంటి అంశాలపై సమీక్షించునున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రెండో దశలో ఇంటి స్థలం లేనివారిని గుర్తించి స్థలం కేటియించి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. జనవరి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లనున్నట్లు సమాచారం.