calender_icon.png 11 January, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం స్టాలిన్ బిగ్ ప్లాన్?

11-01-2025 01:53:22 AM

* తమిళనాడులో ఇటీవల బయటపడ్డ పురాతన లిపి

* సింధు లిపితో 90శాతం సరిపోలుతున్న కొత్త లిపి

* నిరూపితం అయితే ద్రవిడ సంస్కృతి కోసం మరింత పోరాడే అవకాశం

* ఇందులో భాగంగానే సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్

చెన్నై, జనవరి ౧౦: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవల సింధూ నాగరికతకు సంబంధించిన లిపిపై బంపర్ ఆఫర్ ప్రకటించారు. సింధూ లిపిని డీకోడ్ చేసిన వారికి రూ. 8.5కోట్ల (ఒక మిలియన్ డాలర్ల) ప్రైజ్‌మనీ అందజేయనున్నట్టు చెప్పారు. అయితే దీని వెనక పెద్ద కారణం ఉన్నట్టు సమాచారం.

ఆర్యులకు ముందే ఉత్తర భారత దేశంలో ద్రవిడులు నివసించారని నిరూపించేందుకు సీఎం స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సీఎం స్టాలిన్ పట్టుదలను మరింత పెంచినట్టు సమాచారం. 

తమిళనాడులో బయటపడ్డ పురాతన లిపి

వాయువ్య భారతదేశంలో 1920ల్లో సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో సింధూలోయ నాగరికతకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రణాళికాబద్ధమైన నగర జీవితాన్ని గడిపినట్టు తవ్వకాల ద్వారా తెలిసింది.

అయితే సింధూ ప్రజలు ఉపయోగించిన బొమ్మల లిపిని ఇంత వరకూ ఎవరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడెప్పుడో బయటపడ్డ లిపిపై తమిళనాడు సీఎం కు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకురావడానికి తమిళనాడులో ఇటీవల తవ్వకాల్లో బయటపడ్డ లిపినే కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో ప్రవహిస్తున్న వాగై నదీ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిగాయి. ఈ క్రమంలోనే పురావస్తు శాస్త్రవేత్తలు ఓ కొత్త లిపిని గుర్తించారు. ఆ లిపి సింధూలోయ నాగరికతకు సంబంధించిన లిపితో దాదాపు 90శాతం సరిపోతుందని అధ్యాయనాల్లో వెల్లడైంది. 

సీఎం స్టాలిన్ ఎజెండా ఇదే?

ఆ లిపిని డీకోడ్ చేయడం ద్వారా సింధూ నాగరికతతో తమిళనాడుకు గల ప్రాచీన సంబంధాలు బయటపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే దక్షిణ భారతదేశంలోని ద్రవిడులు ఉత్తర భారతదేశంలో ఆర్యుల కంటే ముందే నివాసం ఉందనే విషయం స్పష్టమవుతుంది. దీంతో సీఎం స్టాలిన్ తన ద్రవిడ వాదాన్ని మరింత బలంగా వినిపించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారతదేశ సంస్కృతిపై ఆర్యుల కంటే ద్రవిడుల ప్రభావమే ఎక్కువ అని నిరూపించేందుకు సీఎం స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీని ద్వారా ద్రవిడ సంస్కృతికి తానో సంరక్షకుడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో తనకు తిరుగుండదనే యోచనలో సీఎం స్టాలిన్ ఉన్నారట.  ఈ ఎజెండాతోనే సింధూ లిపిని డీకోడ్ చేసిన వారికి పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని ఆఫర్ చేసినట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.