calender_icon.png 10 March, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్ సమరం

08-03-2025 12:00:00 AM

ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ

జేఏసీ ఏర్పాటుకు పిలుపు

ఈ నెల 22న చెన్నైలో సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానం

చెన్నై, మార్చి 7: డీలిమిటేషన్‌పై పోరాటంలో భాగంగా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం లేఖ రాశారు. డీలిమిటేషన్‌పై కేంద్రం చేస్తున్న కసరత్తుకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించడానికి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఏర్పాటు చేద్దామని లేఖ ద్వారా స్టాలిన్ పిలుపునిచ్చారు. ఉమ్మడి కార్యాచరణ కోసం మార్చి 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ రాష్ట్రాలతోపాటు డీలిమిటేషన్ వల్ల ప్రభావితం అయ్యే పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్  రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు.

తమిళనాడు చేస్తున్న ప్రతిపాదనకు సమ్మతి తెలపడంతోపాటు .. జేఏసీలో పని చేస్తూ ఏకీకృత వ్యూహాన్ని సమన్వయం చేయడంలో సహాయం చేయడానికి పార్టీల నుంచి సీనియర్ ప్రతినిధులను నామినేట్ చేయాలని స్టాలిన్ తన లేఖలో కోరారు. అలాగే రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు జేఏసీలో చేరాలని పిలుపునిచ్చారు. అందరి మంచి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ‘డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తోన్న దాడి. ఇది పార్లమెంట్‌లో మన హక్కులకు కోత పెట్టి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. ఈ అన్యాయాన్ని మేం సహించం’ అంటూ స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.