calender_icon.png 19 November, 2024 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సారూ, మీరే ఆదుకోవాలి!

30-07-2024 12:00:00 AM

‘మా ఊరిలో మల్లన్నసాగర్ వద్దు’ అని సర్కార్‌తో  కొట్లాటకు దిగిన నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా 2016 జూన్ 25, 26 తేదీలలో రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేసిన నాయకుడే ఇవాళ్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి! ముంపు గ్రామాల ప్రజల బాధలన్నీ ఆయనకు తెలిసినవే. ‘మమ్మల్ని ఆయన తప్పక ఆదుకుంటారని’ బాధితులంతా ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఎకరానికి సుమారు 6 లక్షల రూపాయలకు ఒప్పించిన తర్వాత వేములఘాట్ గ్రామం మినహా మిగతా అన్ని గ్రామాలవారు భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆయా ఊళ్లలోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ముగించారు. అప్పుడు ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బురదలో తొక్కి ఆనాటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు 2021లో నిర్దాక్షిణ్యంగా పోలీసుల పహారాల మధ్యలో బలవంతంగా 14 ఊర్లను ఖాళీ చేయించారు. 

గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్‌పల్లి శివారులో తాత్కాలిక డబుల్ బెడ్ రూమ్‌లు కొన్ని గ్రామాలకు, శాశ్వత బెడ్రూమ్‌లు మరికొన్ని గ్రామాలకు కేటాయించారు. గ్రామాలు ఖాళీ చేయడానికి కనీస సమయం ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాల సామాన్లు మల్లన్నసాగర్‌లో కలిసిపోయాయి. గుడికి గుడి, బడికి బడి, ఇల్లుకి ఇల్లు, స్మశానానికి స్మశానం కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా 14 ఊర్లకు ఒక్క స్మశాన వాటిక లేకపోవడంతో ఒక శవం కాలేదాకా ఇంకొక శవం ఖననం కోసం రోడ్డుమీద ఎదురు చూసే దుస్థితి నెలకొంది. ఆనాటి రాజకీయ నాయకులు ఆయా గ్రామాలకు ఇచ్చిన వాగ్దానాలు వేటిని కూడా నెరవేర్చలేదు. 

కేసీఆర్ ఫామ్‌హౌస్ మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి కూతవేటు దూరంలోనే ఉంది. మల్లన్నసాగర్ నిర్మాణానికి సుమారు 20,000 ఎకరాలు (14 గ్రామాలు) కావలసి వచ్చింది. సుమారు పదివేల జనాభా చెట్టుకొకరు పుట్టకొకరు, చెట్టిడిసిన పక్షులోలే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న స్థితి నెలకొంది. ‘నిర్వాసితులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మన్న కేసీఆర్ ఏడు సంవత్సరాలైనా అపాయింట్మెంట్ ఇయ్యక పాయే. మా మాటలు వినకపాయే!’ అని ముంపు గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సమస్యలకు నిలయంగా ఉంది. నాణ్యత లోపించిన ఇంటి నిర్మాణాలు ఒకవైపు, మరోవైపు ప్యాకేజీలు, ఓపెన్ ప్లాట్లు, 65 ఏండ్లు పైబడిన ఒంటరి మహిళలు, పురుషులకు ఇప్పటి వరకు గృహాలు ఇవ్వలేదు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉపాధి లేక చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 కంటే ముందు క్రాప్‌లోన్ తీసుకొని, సర్వస్వం కోల్పోయిన రైతులకు బ్యాంకులు రికవరీ కోసం నోటీసులు పంపిస్తున్నాయి. ప్రత్యేక జీవో ద్వారా ముంపు బాధితుల క్రాప్ లోన్లు మాఫీ చేయాలి. ‘ప్రభుత్వం మారితే తప్ప, ముంపు గ్రామాల ప్రజల బతుకులు బాగుపడవని’ అందరూ అనుకున్నారు. ‘అయ్యా! ముఖ్యమంత్రి గారూ!! మా వెతలు, కష్టాలు, నష్టాలు మీకు తెలియని కావు. మరింత ఆలస్యం జరక్కుండా మాకు న్యాయం చేయండి. రావలసిన నష్టపరిహారాలను ఇచ్చి ఆదుకోండి’ అని బాధితులు వేడుకొంటున్నారు.

 పులి రాజు, సామాజిక కార్యకర్త