calender_icon.png 5 December, 2024 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సార్.. బకాయిలు ఇవ్వండి!

04-12-2024 12:40:58 AM

  1. శాతవాహన వర్సిటీ పరిధిలో ఫీజు ‘నో’యింబర్స్‌మెంట్ 
  2. నాలుగేళ్ల నుంచి పెండింగ్.. 
  3. నిలిచిన బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు
  4. ఒక్కొక్కటిగా మూతపడుతున్న కళాశాలలు

కరీంనగర్, డిసెంబరు 3 (విజయక్రాంతి): నాలుగేళ్ల నుంచి ఫీజు రీయిం బర్స్ మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నాయి. వర్సిటీ పరిధిలో ప్రస్తుతం 65 ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు, 35 వరకు పీజీ కళాశాలలు ఉన్నాయి.

ఈ కళాశాలల్లో 95 శాతానికిపైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చదువుతున్నారు. గడిచిన పది సంవత్సరాల్లో సుమారు 40 కళాశాలల వరకు మూతపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత భవనాలున యాజమాన్యాలు అప్పో సప్పో చేసి నెట్టుకువస్తున్నాయి. కానీ, అద్దెలు చెల్లించాల్సిన యాజమాన్యాలు చేతులెత్తుస్తున్నాయి. విద్యాసంస్థలను నడపలేక మూసివేయాల్సిన పరిస్థితి దాపురించింది.

ప్రస్తుతం వర్సి టీ పరిధిలో 65 కళాశాలలు మాత్రమే నడుస్తున్నాయి. గత ప్రభుత్వం 2021 సం బంధించి 25 శాతం మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించింది. 2022 2023 -24కు సంబంధించి వందశాతం మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది. 

ఆందోళన బాట..

అక్టోబర్‌లో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆందోళనబాట పట్టగా, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వారితో చర్చలు జరిపారు. నాలుగు రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

దీంతో మెజార్టీ యాజమాన్యాలు ఎనిమిది నెలల నుంచి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నాలుగేళ్లలో మరో 20 కళాశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బకాయిల ప్రభావం సుమారు 40 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతున్నది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లిలో పర్యటిస్తున్న నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను ఆలకించాలని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రభుత్వం దిగిరా కుంటే త్వరలో నిర్వహించాల్సిన పరీక్షలను కూడా బహిష్కరించే యోచనలో యాజమాన్యాలు ఉన్నాయి. 

వడ్డీలు కట్టలేకపోతున్నాం..

ప్రభుత్వం మాకు చెల్లించాల్సిన ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ను దశలవారీగా చెల్లిస్తే ఆర్థికంగా నిలదొక్కు కోగలుగుతాం. విద్యార్థులను మేం ఫీజు అడిగే పరిస్థితి లేదు. ఇప్పటికే మేం నిర్వహణకు అప్పులు తె చ్చాం. వాటికి వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాం. బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది.

ఎన్నో యాజమాన్యాలు ఇప్పటికే కళాశాలలను అమ్ముకున్నాయి. చాలా చోట్ల మూతపడ్డాయి. సీఎం రేవంత్‌రెడ్డి మా పరిస్థితిని అర్థం చేసుకో వాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.

 వెంకటేశ్వరరావు, 

శాతవాహన డిగ్రీ, పీజీ కళాశాలల సంఘం అధ్యక్షుడు 

నాలుగేళ్లుగా పెండింగ్..

నాలుగేళ్ల నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన నాడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీని నెరవేర్చలేదు. సీఎం తానే విద్యాశాఖను నిర్వహిస్తూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. బకాయిల కారణంగా కళాశాలల యాజమాన్యాలు అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాయి.               

కసిరెడ్డి మణికంఠరెడ్డి, , ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

బకాయిలు విడుదల చేశాకే సీఎం జిల్లాలో పర్యటించాలి

విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేసిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం దారుణం. బకాయిల కారణంగా కళాశాలల యాజాన్యాలతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందిపడుతున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. 

చెన్నమళ్ల చైతన్య, శాతవాహన వర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్