విగ్రహానికి పాఠాలు చెప్పి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
నిర్మల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): తమ డిమాండ్లను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. నిర్మల్‌లో బుధవారం ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహానికి తమ కష్టాల పాఠాలు చెప్పి వినూత్న నిరసన చేపట్టారు. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.
కేంద్రమంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్
ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఛాయి తాగే లోపు జీవో ఇప్పిస్తాం అన్న సీఎం సంవత్సరమైనా ఇంకా చాయ్ తాగే సమయం దొరకలేదా అని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు బుధవారం ఆయన మద్దతె తెలిపారు.
తమ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడితో బహిరంగ లేఖ రాయిస్తామని చెప్పి, దీక్ష శిబిరం నుంచే పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఉద్యోగుల దీక్ష గురించి చెప్పారు. ఉద్యోగుల న్యాయపరమైనా డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున ఉద్యోగులకు రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు రమేశ్, నగేష్, వేణు గోపాల్, లాలా మున్న పాల్గొన్నారు.
నేడు చలో ఇందిరాపార్క్
కామారెడ్డి(విజయక్రాంతి): సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని గురువారం చలో ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాకినల అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. గత 15 రోజులుగా చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందుకు నిరసనగా చలో ఇందిరాపార్క్ వద్ద టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ ధర్నాకు తరలిరావాలని అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు.