15-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 14: (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ అన్నారు.
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని, కెసిఆర్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం బీ ఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపో వడంతో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తుంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలు విసురుకుంటున్నారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శంకర్ ముదిరాజ్, శివ ముదిరాజ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, దీన్ దయాల్ రెడ్డి, పున్న సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ముదిగొండ మురళి, పోతుల శ్రీకాంత్, టెంట్ హౌస్ శ్రీను, రామస్వామి, వంశీ బల్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.