calender_icon.png 9 November, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం.. సమోసా.. ఓ వివాదం

09-11-2024 01:18:16 AM

హిమాచల్‌లో సమోసాపై రాజకీయ చర్చ

న్యూఢిల్లీ, నవంబర్ 8: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో సమోసా పేరు మార్మోగుతోంది. ఈ వివాదంపై స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఈ వివాదమేంటంటే గతనెల 21న సీఎం సుఖ్విందర్ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ఓ పేరున్న హోటల్ నుంచి సమోసాలు తెప్పించగా, వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తిన్నారని వార్తలు వచ్చాయి.

సీఎం వద్దకు చేరాల్సిన సమోసాలు ఎలా మిస్సయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరని సీఐడీ తేల్చనుందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సమోసాల వ్యవహారం దుమారం రేపడంతో సీఎం సుఖు స్పందించారు. సీఐడీ విచారణ జరుపుతున్న అంశం వేరని, కానీ ప్రతిపక్షాలు సమోసాపై ప్రచా రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.