25-02-2025 02:05:51 AM
కరీంనగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం కరీంనగర్-మెదక్ - ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నిజామాబాద్, మంచిర్యాలతోపాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం స్వయంగా సీఎం రావడం, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ప్రతిపక్షాలు ఈ అంశాలపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు, పట్టభద్రులు కృషి చేయాలని ఆయన కోరారు. సీఎం సభల విజయవంతంతో నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్న ధీమా నేతల్లో నెలకొంది. టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ర్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభ్యర్థి నరేందర్ రెడ్డి సీఎం సభలలో పాల్గొన్నారు.
రెండవసారి కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పార్టీ శ్రేణులంతా రెండు రోజుల సమయాన్ని వృథా చేయకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తనకు అన్ని వర్గాల మద్దతు ఉందని, తన గెలుపును అగ్ర నేత రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.