calender_icon.png 12 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌ది ఆటవిక ప్రవర్తన

04-08-2024 01:50:35 AM

  1. సభా నాయకుడిగా వ్యవహరించలేదు
  2. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి సభా నాయకుడిగా కాకుండా ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయనది ప్రజాపాలన కాదని, ప్రతిపక్షాలపై పంజా విసిరే పాలనగా ఉందని ఈ బడ్జెట్ సమావేశాలు నిరూపించాయని మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తన 25 ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలో ఇంత అధ్వానపు సభ చూడలేదన్నారని, గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ మీద తిట్ల దండకం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు.

ఈ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను బుల్డోజ్ సమావేశంగా మార్చిందని, క్వశ్చన్ అవర్ ఒక రోజే పెట్టారని, జీరో అవర్ ఎత్తివేసి ప్రతిపక్షాల గొంతు నొక్కారని విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల మాట ఎత్తలేదన్నారు. సభలో అబద్ధాలు మాట్లాడారని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమో ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో ఉద్యోగాలు వచ్చాయి తప్ప అందులో రేవంత్ సర్కార్ కృషి ఏమీలేదన్నారు. కేటీఆర్ ద్రవ్యవినిమయ బిల్లుపై వాస్తవాలు చెబుతుంటే సీఎం జోక్యం చేసుకుని అనవసరంగా మహిళా ఎమ్మెల్యేలను దూషించి కంటతడి పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కేసీఆర్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు: పాడి కౌశిక్‌రెడ్డి

బీఆర్‌ఎస్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌డ్డి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఒక ఉద్యోగం ఎక్కువ ఇచ్చారని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.  నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారని, ప్రభుత్వం ఉత్త పత్రాన్ని విడుదల చేసి నిరుద్యోగులను నిరాశ పరిచిందన్నారు. తాము నిరుద్యోగులపై మాట్లా డుతుంటే సీఎం రేవంత్.. దానంను రెచ్చగొట్టి బూతులు మాట్లాడించారని పేర్కొన్నారు.