calender_icon.png 11 January, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై సీఎం రేవంత్ సమీక్ష

11-01-2025 03:56:22 PM

హైదరాబాద్: నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి  సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ పోలీస్ స్టేడియం(Goshamahal Police Stadium)లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు వివరించిన మ్యాప్‌లలో సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం(Construction of hospital) ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందిం చాలని సూచించారు.

భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.