calender_icon.png 19 November, 2024 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డిది.. కొండగల్ కాదు

19-11-2024 03:31:36 AM

కొండగల్ లో పుట్టిపెరిగి ఉంటే రైతుల కష్టాలు తెలిసి ఉండేవి

రైతులపై దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల

సంగారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి):  సీఎం రేవంత్‌రెడ్డికి కొండగల్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ఆయన అక్కడ పుట్టింది కాదు, పెరిగింది కాదు, అక్కడ ఆయనకు భూములు లేవు.. అలాంటిది అక్కడి రైతులు పడే బాధలు ఆయనకు ఎలా తెలుస్తాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని లగచర్ల రైతులు ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోని సీఎం.. రైతుల నుంచి బలవంతగా భూములు తీసుకోనేందుకు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల గ్రామ రైతులతో సోమవారం ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆమె ములాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పినప్పటికీ ప్రభుత్వం వారిని బలవంతం చేయడం తగదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న.. తిరుపతిరెడ్డి రైతులపై దౌర్జన్యం చేయడంతో పాటు బెదిరించి భూములు ఇచ్చినట్లుగా సంతకాలు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. లగచర్ల రైతులను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్నారు. 

రైతులకు క్షమాపణ చెప్పాలి: ఈటల

ప్రభుత్వ అవసరాల కోసం లగచర్ల రైతుల నుంచి భూములు తీసుకోవడం లేదని.. ఫార్మా కంపెనీల వ్యాపారుల కోసం తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. అరెస్టయిన రైతులను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఈటల ఆరోపించారు. జైల్లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేశారు. వారివెంట సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ నాయకులు ఉన్నారు.

లగ చర్ల కు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు 

లగచర్ల ఘటనలో అరెస్టున రైతులను సంగారెడ్డి జైలులో కలిసిన అనంతరం... లగచర్లలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకులను మొయినాబాద్ వద్ద పోలసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులతో ఎంపీ డీకే అరుణ వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరు అధికారంలో ఉంటే వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఓ చేతకాని దద్దమ్మ అని, సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ నియంత్రణ చేయలేని అసమర్థుడు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.