11-03-2025 12:21:04 AM
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయించడం హర్షణీయం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా 55 యంగ్ ఇండియా సమీకృత గురుకుల గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ. 11 వేల కోట్లను కేటాయిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 55 నియోజకవర్గాల్లో, ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీయల్ స్కూలుకు రూ. 200 కోట్ల నిధులను కేటాయిస్తూ, దానిలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గాన్ని కూడ మొదటి దశలో ఎంపిక చేసి, పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి, నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు, నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపి నన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తుండటం చరిత్రగా నిలిచిపోనుందని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడం జరుగుతుందని, విద్యతో పాటు, క్రీడలు, సాంకేతిక కంప్యూటర్ విద్య, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర కోర్సులను అందించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి పాలమూర్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, నాయకులు గుర్రం కేశవులు, కొండల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.