06-04-2025 12:54:15 AM
భద్రాచలంలో పకడ్బందీగా ఏర్పాట్లు
2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రేపు మహాపట్టాభిషేకం
భద్రాచలం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే ఆంచనాతో జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు జడ్జీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి అధికారులు రానున్నారు. సీతారాముల కల్యాణం ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మిధిలా స్టేడియంలోని శిల్పకళా నైపుణ్యం గల కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. సోమవారం మహా పట్టాభిషేకం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మిధిలా స్టేడియంలో చాందిని వస్త్రంతో అలంకరించి మామిడి తోరణాలు ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాన్ని వివిధ ప్రాంతాల్లో లభించే పూలమాలతో సుందరంగా అలంకరించారు. కల్యాణం ప్రత్యక్షంగా వీక్షించడానికి కల్యాణమండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. భక్తులకు మజ్జిగ, మంచినీరు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. కల్యాణం తిలకించేందుకు వీలుగా భక్తుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా సారపాకలో మూడు హెలిప్యాడ్స్, భద్రా చలంలో ఒక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.
కనుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. రుత్వికులు వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా ఈ ఉత్సవం సాగింది. ఆలయ పరిసరాల్లో భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. ఉత్తర ద్వార దర్శనం ఎదురెదురుగా శ్రీ రాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా వారి వంశ కీర్తి ప్రతిష్ఠల్ని వివరించారు.