calender_icon.png 28 December, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలు

14-07-2024 02:52:59 PM

హైదరాబాద్ : గీతకార్మికులకు 'కాటమయ్య రక్ష కిట్ల' పంపిణీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్ గూడలో ప్రారంభించారు. గౌడన్నలు కోరినట్లు ప్రభుత్వం భూముల్లో తాటి చెట్లు, ఈత చెట్లు పెంచుతామని తెలిపారు. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలన్న సీఎం ఈ ప్రాంత అభివృద్ధిలోనూ గౌడన్నల పాత్ర మరవలేనిదన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఎన్నో కీలక ప్రాజెక్టులు తేవటంలో దేవేందర్ గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ గౌడన్నలకు ఎన్నో పదవులను ఇచ్చి గౌరవించుకుంటున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

గౌడన్నలు తాటిచెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదాల బారినపడొద్దని భావించి ప్రత్యేకంగా సేఫ్టీ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరెస్టు ఎక్కిన వారి సూచనలు తీసుకుని సేఫ్టీ కిట్ రూపకల్పన జరిగిందన్నారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం దక్కాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచించిందని వాఖ్యానించారు. అందుకే పేదల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చామని, గత పదేళ్లుగా రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొనం ప్రభాకర్, గడ్డం ప్రసాద్, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.