హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), తెలంగాణ పార్టీ వ్యవహారాల ఎఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(AICC in-charge of party affairs Deepadas Munshi) గురువారం సమావేశం కానున్నారు. ఈ ఎమ్మెల్యేలతో జరిగే ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Congress President Mahesh Kumar Goud), ఇతర నాయకులు పాల్గొంటారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవరుల అభివృద్ధి కేంద్రంలో రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ఎమ్మెల్యేలతో ఈ ముఖాముఖి కొనసాగనుంది.
రాష్ట్రంలో నిర్వహించిన కుల సర్వే, ఎస్సీ వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం, ఈ నిర్ణయాలపై ప్రజలను ఎలా చేరుకోవాలో సీనియర్ నాయకులు చర్చిస్తారని వారు తెలిపారు. ఇక, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతున్నట్లు వార్తులు వస్తున్నాయి. కొంతమంది మంత్రుల పనితీరుపై తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో సంభాషించడం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ వద్ద ప్రస్తావించి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో అసంతృప్త నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.