రూ. 100 కోట్లు వేయకండని లేఖ రాశాం
వివాదాల్లోకి తెలంగాణను తీసుకురావోద్దు
హైదరాబాద్: అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించిందని అడుగుతున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదనీ నుంచి పెట్టుబడులు నిబంధనల మేరకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం వెల్లడించారు.
అంబానీ, అదానీ, టాటా.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని రేవంత్ రెడ్డి సూచించారు. సీఎస్ఆర్ కింద స్కిల్ వర్సిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్లు విరాళం ఇచ్చిందని వెల్లడించారు. అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరినుంచీ డబ్బు రాలేదని వివరణ ఇచ్చారు. అదానీ ఇస్తామన్న రూ. 100 కోట్లు స్వీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని రేవంత్ స్పష్టం చేశారు. అదానీ ఇస్తామన్న రూ. 100 కోట్లను ప్రభుత్వ ఖాతాలో వేయకండని లేఖ రాశాం. అదానీ రూ. 100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను తీసుకురావోద్దు అని సీఎం రేవంత్ హెచ్చరించారు.