హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కలిసి పర్యటించారు. జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. పాలమూరు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామగ్రామానికి, తండాలకు బీటీ రోడ్డు వేసే బాధ్యత తనదని సీఎం వెల్లడించారు. బీటీ రోడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరుకు విద్య, వైద్యం, ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అమర్ రాజా పరిశ్రమలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.