calender_icon.png 27 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర మంచిది కాదు

26-01-2025 01:21:23 PM

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

ప్రొఫెసర్ల వయోపరిమితి 65కు పెంచే ఆలోచన

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ(Dr. BR Ambedkar Open University)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వర్సిటీల వీసీలుగా అన్ని సామాజిక వర్గాల నుంచి ఉండాలని నిర్ణయించామని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి కావాల్సిన చికిత్స బాధ్యత వీసీలపై పెడుతున్నామని వెల్లడించారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. ప్రణాళికాబద్దంగా వర్సిటీలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వర్సిటీల ప్రణాళికలను అమలు చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వీసీల నియామకం యూజీసీ(University Grants Commission) ద్వారా చేపట్టే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి సూచించారు. యూజీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వ(Central Government) పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదని వెల్లడించారు. వర్సిటీల స్వయంప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది? అని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి యూజీసీ నిబంధనల(UGC norms)పై పోరాడతామని తేల్చిచెప్పారు.

యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగం(Constitution of India)పై దాడి అన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర మంచిది కాదని హితువు పలికారు. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉందన్నారు. కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులు గుంజుకుంటే ఎలా? అన్నారు. కేంద్రం తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రాలు నామమాత్రం అవుతాయని తెలిపారు. ప్రొఫెసర్ల వయోపరిమితి(Professor Age Limit) 65 కు పెంచే ఆలోచన ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.