హైదరాబాద్: మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూబ్లిహిల్స్ నివాసంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రి బాయి పూలే(Savitribai Phule) ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఈ సందర్భంగా పూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని అన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళల సాధికారత, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాల వృద్దికి ప్రజా ప్రభుత్వం(Praja Prabhutvam) ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను ఇటీవలే పూర్తి చేసిందని చెప్పారు. వారి త్యాగానికి, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా టీచర్లు సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.