హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు. అటు ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ మంజూరు చేశారు. పెద్దపల్లి 50 పడకల ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రి ఆప్ గ్రేడ్ కోసం రూ.51 కోట్లు మంజూరు చేసింది. పెద్దపల్లికి నాలుగు వరసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు. పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో రూ. 24.5 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు సర్కార్ అనుమతిచ్చింది.
నేడు పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం తెలిపారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. తన పర్యటనలో సుల్తానాబాద్-పెద్దపల్లి బైపాస్ రోడ్డు, ఇందిరా మహిళా శక్తి, గ్రంథాలయ భవనాల నిర్మాణం, ఆర్టీసీ బస్ డిపో, ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.