- స్వామివారి సన్నిధిలో జన్మదిన వేడుకలు
- క్షేత్రం అభివృద్ధి పనులపై సమీక్ష
- మధ్యాహ్నం1.౩౦కి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర
- సంగెం నుంచి భీమలింగంపల్లి వరకు 2.5 కి.మీ. యాత్ర
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి
హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, నవంబర్ 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలో కుటుంబసభ్యులతో కలిసి ఉద యం 10 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంత రం ఆలయ పెండింగ్ పనులపై వైటీడీఏ అధికారులతో ఉదయం 11.30 గంటలకు సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
ఆలయ విమానగోపుర స్వర్ణతాపడం, అర్ధాంతరం గా నిలిచిపోయిన అభివృద్ధి పనులు, భూసేకరణ వివరాలు, పరిహారం చెల్లింపుల బకాయిల వంటి అంశాలను చర్చించనున్న ట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిషన్‌భగీరథ నీటి విడుదల కార్యక్రమానికి సీఎం పూజలు చేయనున్నారు.
అనంతరం రోడ్డు మార్గాన వలిగొండ మండలం సంగెం గ్రామానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. సంగెం నుంచి భీమలింగంపల్లి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రను చేయనున్నారు. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్టవెంబడి సంగెం నుంచి నాగిరెడ్డిపల్లి రోడ్డువరకు పాదయాత్ర చేయనున్నారు.
అక్కడే యాత్రనుద్దేశించి పునరుజ్జీవ సంకల్ప రథం పైనుంచి సీఎం మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, మూసీ వెంట చేపట్టిన పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రలో భాగంగా మూసీ కాలుష్యం కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు, మత్య్య, గీత, రజక, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ఆయా వర్గాలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం తీసుకున్న విషయాలను వివరించనున్నారు.
సీఎం హోదాలో గుట్టకు రెండోసారి
సీఎంహోదాలో రేవంత్‌రెడ్డి రెండోసారి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. మొదట మార్చి 11న యాదగిరిగుట్ట లక్ష్మీనరసంహాస్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు మంత్రులతో కలిసి సం దర్శించారు. తిరిగి తన జన్మదిన సందర్భంగా శుక్రవారం క్షేత్రాన్ని సందర్శించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. సంగెం బ్రిడ్జి వద్ద రైతులతో సమావేశ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తిచేశారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. సీఎం పర్యటన సందర్భంగా యాదాద్రి భువనగిరి జోన్‌లో పోలీస్ యాక్ట్ సెక్షన్ 21 అమలులో ఉంటుందని రాచకొండ సీపీ తెలిపారు. సీఎం పర్యటన మార్గంలో అవసరాల మేరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టనున్నట్టుగా పేర్కొన్నారు.