- లోక్సభ స్పీకర్ కూతురు వివాహానికి హాజరు
- కాంగ్రెస్ పెద్దలతోనూ భేటీ అయ్యే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి వివాహానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. వివాహ కార్యక్రమం అనంతరం సీఎం తిరిగి హైదరాబాద్కు వస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు పార్టీ పెద్దలను ఆహ్వానించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.
డిసెంబర్ 9వ తేదీనే సచివాలయం ఆవరణలో ‘ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రం కూడా ఉండటంతో పార్టీ పెద్దలను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో పాటు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకంపైనా కూడా కసరత్తు చేసే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.