calender_icon.png 22 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

75 ఏళ్లు పూర్తయినా.. దేశంలో కులగణన జరగలేదు

14-02-2025 06:21:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కులగణన, ఎస్సీ వర్గీకరణపై గాంధీభవన్(Gandhi Bhavan)లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పవర్ పాయింట్ ప్రజంటేషన్(Powerpoint Presentation) ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... దేశంలో దశాబ్దాలుగా నానుతున్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) పరిష్కారం చూపుతోందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress Leader Rahul Gandhi) నడిచారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దేశంలో కులగణన జరగలేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ చెప్పారని, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Congress President Sonia Gandhi) చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లి సోనియాగాంధీ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ కూడా కులగణనపై హామీ ఇచ్చారని, దేశంలో కులగణన చేసి కులాల జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు.

రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టంగా, శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపై విపక్షం దుష్ర్పచారం చేస్తోందని, ఐదు కేటగిరిల కింద కులగణన సర్వే వివరాలు సేకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉందని, గత ప్రభుత్వం సర్వే చేసి వివరాలు వెల్లడించకుండా దాచిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఇన్నాళ్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. తెలంగాణ సమాజంలో నివసించే హక్కు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. 

సర్వేలో పాల్గొనకుండా, వివరాలు చెప్పని వ్యక్తి ఇప్పుడు విమర్శిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబం నుంచే నలుగురు మంత్రులు ఎలా ఉన్నారని ప్రజలు అడుగుతారని భయపడ్డారు. తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు అని, తమ నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు తాను కార్యకర్తగా మిలగిలేందుకు సిద్ధామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాలని పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాహుల్ గాంధీ నిలదీశారని, ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని సీఎం చెప్పారు.

సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని, నరేంద్రమోదీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబీతాలో చేర్చుకున్నారని, సర్టిఫికెట్ ప్రకారం మాత్రమే మోదీ బీసీ వ్యక్తి ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్రకులం అన్నారు. కులగణన జరిగితే చట్టం ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చు అని, అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చు కాదా.. అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జనాభా లెక్కలు జరిగేటప్పుడు కేంద్రప్రభుత్వం కులగణన కూడా చేయాలని కోరారు.