18-02-2025 02:08:10 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హెచ్ఐసీసీ(HICC)లో మంగళవారం, బుధవారం షీల్డ్-2025 సదస్సు(SHIELD-2025 Conference) జరిగింది. షీల్డ్-2025 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సదస్సులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గతేడాది సైబర్ నేరాల(Cyber Crimes) దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ముందంజలో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని, ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, నేరాల శైలి కూడా మారుతోందన్నారు. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందని, పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్ గా పని చేస్తేనే సైబర్ నేరాలు అరికట్టగలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.