calender_icon.png 15 October, 2024 | 5:33 PM

మేం ఎప్పుడూ కేంద్రం వెంటే ఉంటాం

15-10-2024 03:14:51 PM

వికారాబాద్,(విజయక్రాంతి): దామగుడం నేవీ రాడార్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి రాజ్ నాథ్ సింగ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, బండిసంజయ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వీఎల్ఎఫ్ నమూనాను రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశ రక్షణ విషయంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందన్నారు.  దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్ కు మంచి పేరుందని, వికారాబాద్ జిల్లా వీఎల్ఎఫ్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం అని సీఎం పేర్కొన్నారు.కొదరు లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని, దేశ భద్రత ప్రాజెక్టులపై రాజకీయం చేయడం సరికాదని రేవంత్ రెడ్డి హెచ్చిరించారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదనే మేం కూడా ముందుకొచ్చాం అని, దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం.. చేయనివ్వం అన్నారు. దేశ రక్షణ విషయంలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతం అని, మన పార్టీలు వేరు కావొచ్చు... సిద్ధాంతాలు వేరు కావొచ్చు.. కానీ దేశ భద్రత, రక్షణ విషయంలో తాము ఎప్పుడూ కేంద్రం వెంటే ఉంటామని సీఎం వ్యాఖ్యానించారు. దేశ భద్రత ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, నేవీ కళాశాలలో 25 శాతం సీట్లు స్థానికులకు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.