హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, వర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాం, విద్యావ్యవస్థను బాగు చేయడానికి విద్య కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ టీచర్లకు ఉన్న అర్హత ప్రైవేట్ టీచర్లకు లేదని తెలిసిన కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడానికి ఇష్టపడట్లేదని, ప్రభుత్వ బడుల ప్రతిష్ట పెంచే బాధ్యత టీచర్లదే అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవాలని, అలాగే అధికారులు జిల్లాలో రెండు రోజులపాటు పాఠశాలలను పర్యవేక్షించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ఇటీవల వార్తల్లో చూస్తున్నా విద్యార్థుల ఆహారంలో కల్తీ జరుగుతోంది.
విద్యార్థులు తిన్నే భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని విద్యుర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. హాస్టల్ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని, విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి అన్నం పెట్టాలని సూచించారు. దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయాలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని, గత ముఖ్యమంత్రిని, మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను మీరు ఎప్పుడైనా చూశారా..? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు మీ రేవంత్ అన్న మీతో చేయి కలిపాడా.. లేదా..? అని సీఎం అడిగారు. విద్యార్థులు మంచిగా చదువుకొని దేశానికి ఆదర్శంగా ఉంటామని, చెడు వ్యసనాలకు బానిసలు కాబోమని ప్రమాణం చేయాలని కోరారు. మీకు 50 శాతంపైగా రిజర్వేషన్లు కావాలన్న, విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలన్న కులగణన జరగాలన్నారు.
కులగణపై వస్తున్న అపోహలను తొలగించే బాధ్యత విద్యార్థులదే అన్నారు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి కులగణనపై అవగాహన కల్పించాలన్నారు. ఎవరు అడ్డు వచ్చినా కులగణన ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2025లో జరిగే జనగణనలో కూడా కులగణన చేసేలా కేంద్రం మెడలు వంచుతామన్నారు. ప్రస్తుతం జరిగే కులగణనతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరి ఆస్తులు తీసుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి పోటీ చేసే వయోపరిమితిని తగ్గించి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. దాని వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గిస్తే చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెరుగుతుందని, 21 ఏళ్లు నిండినవారు ఐఏఎస్, ఐపీఎస్ గా పనిచేస్తున్నారు. అలాగే 21 ఏళ్లు నిండినవారు కకూడా ఎమ్మెల్యేలుగానూ రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.